Srisailam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమై క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నంద్యాల జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్ ఆదివారం భ్రమరాంభ గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. ఏర్పాట్లు, వసతులపై సమీక్ష నిర్వహించారు. గదుల శుభ్రత, ఆహార వసతులు, నిర్వహణను పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు తదితర అంశాలను పరిశీలించి.. పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జేసీ విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రధాని శ్రీశైలం పర్యటన సందర్భంగా గెస్ట్ హౌస్‌లో వసతుల మెరుగు పరిచేందుకు ప్రాధాన్యంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గెస్ట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలను అత్యాధునికంగా తీర్చిదిద్దే దిశగా మరమ్మతులు, అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. విశిష్ట అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా విద్యుత్, నీటి సరఫరా, భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జేసీ వెంట ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవస్థానం అధికారులు ఉన్నారు.