Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ శుద్ధ చవితి సందర్భంగా గురువారం పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద నాగ దేవతలను పూజించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే నాగుల కట్ట వద్దకు చేరుకుని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఓపవీతం, పలురకాల పుష్పాలు, తదితర వస్తువులతో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకరించారు. తర్వాత నువ్వుల పిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు.
మన సంస్కృతిలో నాగ సంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీశైలంలో కూడా పలుచోట్ల నాగ విగ్రహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారంపై పలు చోట్ల నాగ శిల్పాలు ఉంటాయి.
నాగ శిల్పాలలతో తూర్పు ప్రాకారంపై గల ఆదిశేషుడు, దక్షిణ ప్రాకారంపై గల నాగబంధ శిల్పం ప్రధానమైనవని అర్చక వేద పండితులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితిని శ్రావణ మాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఆచరిస్తున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో శాశ్వత అన్నప్రసాద పథకానికి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం వాసి రజనీష్ దొర రూ.1,00,116 విరాళాన్ని గురువారం అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం హరిదాసు, పర్యవేక్షకులు డీ స్వర్ణలతలకు అంద జేశారు. ఈ సందర్భంగా దాతకు రశీదు అందజేశారు. అర్చక వేద పండితులు దాతకు వేదాశీర్వచనం చేసి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.