Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుతో పాటు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై ముంబై నటి జెత్వానీ పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు ఆమెపైనే తప్పుడు కేసులు బనాయించారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందుకోసం అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీలను సీఎంవోకు పిలిచి కుక్కల విద్యాసాగర్‌తో కలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ప్రణాళిక రచించారు. విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరీ జెత్వానీతో పాటు ఆమె తల్లి ఆశా జెత్వానీ, తండ్రి నరేంద్రకుమార్, సోదరుడు అంబరీశ్లపై ఈ ఏడాది ఫిబ్రవరి 2న నమోదు చేశారు. అనంతరం ముంబైలో వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఈ కేసును అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.