కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్లు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని సీతారామ కాలనీలో నివాసం ఉండే తల్లీ కూతుళ్లను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
మృతులను ములపత్తి మాధురి (30), ఆమె కుమార్తెలు పుష్పకుమారి (5), జెస్సిలోన (4)గా గుర్తించారు. మాధురి భర్త ప్రసాద్ బొలెరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను రాత్రి డ్యూటీకి వెళ్లి ఉదయం వచ్చేసరికి ఇంకా తలుపులు వేసే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా.. రక్తపు మడుగులో తల్లీకూతుళ్లు కనిపించారు. తలపై సుత్తితో బలంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. తొడల దగ్గర బ్లేడుతో కోసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఘటనాస్థలిని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ పరిశీలించారు. ఈ హత్యలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే దోషులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఆ ముగ్గుర్ని భర్తే హత్యచేసి ఉంటాడా? మరెవరైనా చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.