Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తెలిపింది. ఇవాళ రాత్రి కాకినాడకు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను ప్రభావం అంతకంతకు పెరుగుతున్నది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను నేపథ్యంలో కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు తీవ్ర తుపాను సమీపంగా వచ్చిందని వాతావరణశాఖ పేర్కొంది. తుపాను ప్రభావం విశాఖపట్నంపై భారీగా ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో మంగళవారం విశాఖపట్నంలో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ గాజువాకలో కొండచరియలు విరిగిపడ్డాయి. యారాడకొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. వైజాగ్‌లో పలు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి. కళింగపట్నంలో 10.3, అనకాపల్లిలో 8.4, ఉరవకొండలో 8.04, విజయనగరంలో 7.04, నెల్లూరులో 7.2, సూళ్లూరుపేట, 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ పరిసరాల్లో భారీ వర్షంతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ పరిసరాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
తుపాను తీరం దాటే సమయంలో కెరటాలు మీటర్ ఎత్తుకు ఎగిసిపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలన్నీ భయానకంగా మారాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఎక్కడికక్కడ పలుచోట్ల సముద్రం ముందుకు దూసుకు వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి. తుపాను తీరం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఈదురుగాలుల తీవ్రత పెరుగుతున్నది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. యానాంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. కనకాలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్ఆర్కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. నేలకూలిన కూలిన చెట్లను ఎప్పటికప్పుడు సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్నిమాపక, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.