అమరావతి : వైసీపీ పాలనలో కాకినాడ పోర్టును లాక్కుని యదేచ్ఛగా బియ్యం (Rice) అక్రమ రవాణాను కొనసాగించారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు (Kakinada port) నుంచి మూడేళ్లలో కోటీ 31 లక్షల టన్నులు ఎగుమతి చేశారని వెల్లడించారు. కాకినాడలో మూడేళ్లలో చేసిన బియ్యం ఎగుమతి విలువ రూ. 48,537 కోట్లని వివరించారు.
విశాఖ, గంగవరం, కృష్ణపట్నం కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతి చేశారని పేర్కొన్నారు. భారీగా ఎగుమతులు జరిగాయి కనుకనే కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టిని సారించామని తెలిపారు. కాకినాడ పోర్టులోకి అరబిందో రియాలిటీ (Aurobindo) ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరించి మరీ 41 శాతం వాటా రాయించుకున్నారని ఆరోపించారు.
అరబిందో రియాలిటీకి ఎలా దక్కిందో సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు. ఏపీ తీరంలో ఏ పోర్టుకు లేనివిధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగిందని ఆరోపించారు. కాకినాడ సీ పోర్టు మెడపై కత్తి పెట్టి పోర్టును లాగేసుకుని అరబిందో కంపెనీకి అప్పచెప్పారని వివరించారు. స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలని తెలిపారు. రేషన్ బియ్యం తయారికి ప్రభుత్వానికి ప్రతి కిలోకు రూ.43.40 పైసలు ఖర్చు అవుతుండగా కేవలం రూ. 10 లకే పేదల వద్ద కొనుగోలు చేసి విదేశాలకు తరలించి వేలాదికోట్లను సంపాదించుకున్నారని అన్నారు. చిత్తూరు, శ్రీకాకుళం బియ్యాన్ని అక్రమంగా జాతీయ రహదారి గుండా కాకినాడ పోర్టుకు తరలించారని మండిపడ్డారు.