Atchennaidu | గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని.. రూ.13లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఏ శాఖను రివ్యూ చేసినా.. ఎక్కడా అప్పులు తప్ప ఆదాయమే కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. పెంచిన పింఛన్లను రాజకీయ, పార్టీలకు అతీతంగా అందించామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఛాలెంజింగ్‌గా ఉన్న కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తానని వెల్లడించారు.
అధికారుల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారుల బదిలీలు పారదర్శంగా జరుగుతాయని తెలిపారు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు బదిలీల కోసం ఒక్క పైసా ఇచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బదిలీల కోసం పైరవీలను ప్రోత్సహించవద్దని సూచించారు.