Srisailam | అమరావతి: శ్రీశైలం అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడ్డాయి. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన పవిత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు శ్రీశైల అభివృద్ధిపై అటవీ శాఖ అధికారులతో సోమవారం నాడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ దృక్కోణాల్లో శ్రీశైల ప్రాంత అభివృద్ధి కోసం దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శ్రీశైల క్షేత్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ, అటవీ శాఖ సమన్వయంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, పర్యాటకులకు సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు.