AP News | తమ కొడుకును డాక్టర్‌గా చూడాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ కొడుక్కేమో చదువు అబ్బలేదు. అమ్మానాన్నల కోరిక తీర్చేందుకు ఎంబీబీఎస్‌లో అయితే చేరాడు కానీ.. చదివింది బుర్రకు ఎక్కకపోవడంతో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అలా ఫైనల్ ఇయర్‌కు వచ్చేసరికి గంపెడు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా మిగిలిపోయాయి. ఇది చూసి ఆ పేరెంట్స్‌తో ఎంతో కుమిలిపోయారు. కష్టపడి చదివిస్తుంటే.. కొడుకు మాత్రం ఫెయిల్ అవుతున్నాడని తెగ బాధపడిపోయారు. అది చూసి కుమిలిపోయిన ఆ కొడుకు.. తన వల్లే అన్ని ప్రాబ్లెమ్స్ అని భావించి.. ఆత్మహత్య చేసుకున్నాడు. తన పరిస్థితిని చూస్తుంటే బతకాలంటేనే భయమేస్తోందని సూసైడ్ నోట్ రాసి మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆతుకూరి సాయి మణిదీప్ (24) విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ చదువులో అంతగా రాణించడం లేదు. దీంతో రెండో సంవత్సరం నుంచే బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయి. కొడుకు డాక్టరై రోగుల జబ్బులు నయం చేస్తాడేమో అనుకుంటే.. ఇలా ప్రతి సంవత్సరం సబ్జెక్టులు తప్పుతుండటంతో సాయి మణిదీప్‌తో పాటు అతని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు. దీంతో సాయి మణిదీప్ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
తాను బతికి ఉండటం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని.. తానే లేకపోతే ఎవరికీ ఏ సమస్య ఉండదని సాయి మణిదీప్ భావించాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే పురుగుల మందు తాగడంతో విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు.. సాయి మణిదీప్‌ను కాలేజీ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. హాస్టల్లో సాయి మణిదీప్ ఉంటున్న గదిని పరిశీలించారు. అక్కడే వారికి సూసైడ్ నోటు లభించింది.
గత పది సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. బాధపెట్టాను. నా వల్లే ఇంట్లో సంతోషం , ప్రశాంతత లేదు. నా వల్లే మీకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేకపోతున్నా, రకరకాల ఆలోచనలు, ఎందుకు బాధపడతానో తెలియదు. ఎందుకు సంతోషంగా ఉంటానో తెలియదు. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్లు ఏదోవిధంగా బాధపడుతూనే ఉంటారు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువైపోతుందో తెలియట్లేదు. గత 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు తినేస్తున్నాయి. కానీ ఎవరికీ చెప్పలేదు.
ఇప్పటికే నా వల్ల తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల, నాకు నేనే పిచ్చోడిలా అనిపిస్తున్నా అమ్మ. నా కోసం మీరు ఇంత చేశారు. నేను మాత్రం మిమ్మల్ని బాధపెడుతూనే ఉన్నా. మీ నిద్ర, ఆరోగ్యం అన్నీ నావల్లే పోతున్నాయి. బతకాలి అంటేనే భయం వేస్తోందమ్మా.. నా గురించి కాదు, ఇంకా ఎంత కాలం మిమ్మల్ని బాధ పెడతా అని. నా లాంటి పిచ్చోడు ఉండకూడదు. బతుకుదామనే ఆశ ఉన్నా కూడా ఇంత అదృష్టం కూడా ఉండదు. అందుకే మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. నన్ను క్షమించండి డాడీ, అమ్మ. సారీ రా తమ్ముడు.. నీకు ఎప్పుడు ఒక అన్నలా కూడా ఉండలేకపోయా. కానీ ఒక్కటి అమ్మ.. మీ ముగ్గురే నా జీవితం. మీరంటే అంత ఇష్టం. మీరు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటా. సారీ.