Srisailam | శ్రీశైల మహా క్షేత్ర శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భక్తుల రద్దీ పెరుగుతున్నది. దీంతో పాతికేండ్ల మందుచూపుతో పక్కా ప్రణాళికలు కల మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన తన విజయవాడ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి- కమిషనర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్, ఈవో ఎస్ లవన్న, చీఫ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాసరావు, ఈఈ దుర్గేష్, రామకృష్ణ, ద్రోణా క్రియేటివ్ కన్సల్టెన్సీ అండ్ నైన్ అండ్ నైన్ టెక్నాలజీస్ ప్రతినిధి వంశీ తదితరులతో మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించారు. ఈ సమావేశంలో బృహత్తర ప్రణాళికను రూపొందించారు.ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని మూడు జోన్లుగా విభజించాలని జవహార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఆయా జోన్ల పరిధిలో భక్తులకు, యాత్రికులకు మౌలిక వసతులు, అవసరాలు మెరుగు పర్చాలని అధికారులకు ఆయన చెప్పారు. ముఖ ద్వారం నుండి హఠకేశ్వరం, పాలధార పంచధార, సాక్షిగణపతి ఆలయాల పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.
ఇటీవలి సర్వేల ప్రకారం దేవస్థానేతర భూములలో కూడా చేపట్టాల్సిన అభివృద్ది పనులకోసం అటవీశాఖతో రెండింతల విస్తీర్ణం ఇచ్చేట్లుగా పరస్పర భూ బదిలీ ఒప్పందాలను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు. అలాగే అత్యాధునిక సాంకేతికతతో కూడిన టోల్‌ప్లాజా నిర్మాణంతోపాటు క్యూకాంప్లెక్స్లు, అంతర్గత రహదారులు, వసతి ఏర్పాట్లు, కాటేజీలు, వాహన పార్కింగ్, విద్యుద్దీకరణ, ప్రాచీన కట్టడాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మెక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకం నివారణ, ల్యాండ్ స్కేపింగ్‌లను అభివృద్ది చేయాలని సూచించారు.
5300 ఎకరాల క్షేత్రపరిధిని ప్రధానంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో యాక్టివ్ జోన్లో హై సెక్యూరిటీ పరిధిలోగల ఆలయ మాడవీధులు, క్యూకాంప్లెక్స్, అన్నప్రసాద వితరణ, ప్రసాద విక్రయ కేంద్రం, పుష్కరిణి ఉన్నాయి. టెంపుల్ యాక్టివిటి జోన్లో వసతి కల్పన, కళ్యాణకట్ట, పార్కింగ్, శౌచాలయాలను చేర్చారు. టెంపుల్ ఫెసిలిటీ జోన్లో యాత్రికుల ఇతరత్రా అవసరాల కోసం ప్రణాళికలు చేయనున్నారు. ప్రొటెక్టివ్ జోన్లో భవిష్యత్ అవసరాల కోసం అంచనా ప్రణాళికలతోపాటు ప్రొటెక్టివ్ జోన్లో క్షేత్ర సరిహద్దుల పరిరక్షణకు అనుగుణంగా ప్రతిపాదనలను నెల రోజుల్లో సిద్ధం చేయాలని దేవాదాయశాఖ అధికారులను జవహార్ రెడ్డి ఆదేశించారు.
ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధి చెందిన శ్రీశైల క్షేత్ర వైభవానికి అనుగుణంగా పాతికేళ్ల ముందుచూపుతో పక్కా ప్రణాళికలు అమలయ్యేలా అభివృద్ది చేస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. దేవస్థానం ఆధ్యాత్మిక వాతావరణానికి ఎటువంటి భంగం కలుగనివ్వవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇప్పటివరకు క్షేత్రంలో జరుగుతున్న విశేషాలను వివరించి మార్పుచేర్పులను కోరుతూ ప్రధాన కార్యదర్శి నుండి తగు సలహాలను తీసుకున్నారు.