అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో (Shopping Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి వస్త్రదుకాణాలతోపాటు మిగిలిన షాపులకు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో జూనియర్ కాలేజీ, ఎస్బీఐ బ్రాంచీ ఉన్నాయి. తొలుత సెల్‌ఫోన్ దుకాణంలో మంటలు అంటుకున్నాయని.. క్రమంగా అవి మిగతా షాపులకు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెల్లవారుజామన ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.