AP News | విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే.. ఓ యువకుడు ఉరేసుకోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాపురం గ్రామానికి చెందిన కనకల శంకర్రావు లారీ డ్రైవర్. అతనికి కనకల లక్ష్మీ(31)తో పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలతో సంసారం హాయిగా సాగిపోతుంది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. సోమవారం ఉదయం భర్త డ్యూటీకి వెళ్లగానే తన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు లక్ష్మీ ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మద్ది గ్రామంలో ఉండే మరిది ఇంటికి రాగా.. లక్ష్మీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.
ఇదిలా ఉండగా లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలోనే అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య (22) కూడా గ్రామ శివారున బలవనర్మణానికి పాల్పడ్డారు. ఆడ కొండల్లోని గోడౌన్లో ఆదిత్య ఉరేసుకోవడం గమనించిన మేకల కాపర్లు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ఒకే రోజు.. ఒకే సమయంలో వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడటం మిస్టరీగా మారింది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వారి ఆత్మహత్యకు అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.