మచిలీపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ దందా రోజురోజుకు పెరిగిపోతున్నది. డ్రగ్స్ వాడకాన్ని అణచివేసేలా తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటుండగా.. ఏపీలోనూ గంజాయి దందాపై పోలీసులు నజర్ వేశారు. పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు దాడులు జరిపి నిందితులను పట్టుకుంటున్నా.. గంజాయి దందా మాత్రం ఆగడం లేదు.
గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక జగన్నాథపురంలోని రైస్ మిల్లు వెనుక ఖాళీ స్థలంలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు కనిపించారు. పోలీసుల రావడాన్ని గమనించిన విద్యార్థులు అప్రమత్తమై కాళ్లకు బుద్ధి చెప్పారు. అయితే, ఎస్ఐ అనూష వారిని వెంబడించి ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థిని విచారిస్తున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాలను దృష్టిపెట్టినట్లు ఎస్ఐ అనూష తెలిపారు.
అటు తిరుపతిలోనూ గంజాయి వాసనలు వస్తున్నాయి. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను స్థానిక పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 12 కేజీల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన సురేందర్‌రెడ్డి అనే వ్యక్తితోపాటు చెన్నైకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.