తిరుమల : తిరుమలలో రథసప్తమి ( Rathasaptami ) సందర్భంగా ఫిబ్రవరి 4న సిఫారసు లేఖల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman) వెల్లడించారు. శుక్రవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రథసప్తమి రోజున శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సిఫారసు లేఖల దర్శనాల రద్దుతో పాటు, తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నేరుగా వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతిస్తామని వెల్లడించారు. పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
మాఢ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. రథసప్తమికి భారీగా తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని నిర్ణయిచామని పేర్కొన్నారు.
మహా కుంభమేళా లో సేవలందిస్తున్న టీటీడీ సిబ్బందికి ధన్యవాదాలు
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ వద్ద మహా కుంభమేళాలో (Mahakumbhmela) టీటీడీ తరుపున శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టీటీడీ అర్చకులు, అధికారులు, సిబ్బందికి చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహా కుంభమేళలో దాదాపు 250 మందికి పైగా ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు సరాసరి పది వేలకు పైగా మంది శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటున్నారన్నారు.