Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయని ఆయన చెప్పారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలుతో పాటు ప్రత్యేక పూజాధికాలు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం అంకురార్పణ,
ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
మకర సంక్రమణం రోజున గాంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం ఆలయ సాంప్రదాయం ప్రకారం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్రీనివాసరావు అన్నారు. ఉత్సవాల చివరి రోజున పుష్పోత్సవసేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత, పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఈవో ప్రకటించారు.
సామూహిక భోగి పండ్లు.. ముగ్గుల పోటీలు..
మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో 13వ తేదీన భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాల వయసు లోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే విధంగా 14వ తేదీన సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇందులో స్థానికులతోపాటు భక్తులు కూడా పాల్గొనవచ్చునని ఈవో అన్నారు