Maha Shivaratri 2025 | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు శ్రీశైలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఏర్పాట్లపై ఈవో సంబంధిత అధికారులతో కలిసి కైలాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అటవీశాఖ సహకారంతో భీమునికొలను మెట్లమార్గం, కైలాస ద్వారం వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు వీలైనంత చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రహదారి గ్రావెల్ పనులు సైతం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కైలాసద్వారం వద్ద చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్దీకరణ తదితర ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
ఫిబ్రవరి 19న ఉత్సవాలు మొదలవునున్నా.. పాదయాత్రగా వచ్చే భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి వస్తారన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి తొలివారం వరకే పనులన్నీ పూర్తవ్వాలని చెప్పారు. అలాగే అన్నదానం చేసే భక్తబృందాలకు దేవస్థానం తరఫున సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అక్కడ దాతలు అన్నదానాన్ని ప్రారంభించే వరకు భక్తుల రద్దీ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టాలని సూచించారు. ఉత్సవం జరిగే రోజుల్లో ఆయా ప్రదేశాల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. ఉత్సవాల సమయంలో వైద్యారోగ్యశాఖ సమన్వయంతో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హఠకేశ్వరం ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని ఉద్యానవనంలో దేవతా మొక్కలు నాటాలని ఆదేశించారు.
ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లను పరిశీలించారు, కంపార్ట్మెంట్లలో ఫ్లోరింగ్‌లో ఎలాంటి పగుళ్లు లేకుండా చూడాలని.. అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారు. క్యూకాంప్లెక్సులో మరిన్ని శౌచాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎప్పటికప్పుడు నీరు సరఫరా జరగేలా చూడాలని చెప్పారు. ఇక శ్రీశైలం దేవస్థానం ప్రసారం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా క్యూ కాంప్లెక్స్‌లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పారు. ఈవో వెంట ఎఫ్ఆర్వో సుభాష్‌రెడ్డితో పాటు దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నారు.