Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని చెప్పారు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు.
అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆయా విభాగాల్లో చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఎం శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 19న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా ముందస్తుగా భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుంటారన్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు కూడా తప్పనిసరిగా ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అన్ని విభాగాల ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణకు నిధులు నిర్వహించాలన్నారు.
గత సంవత్సరానికంటే ముందు ప్రతి చోటా కూడా అవకాశం ఉన్న మేరకు 20-30 శాతం అదనపు ఏర్పాట్లు చేయాలని ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు కూలంకుషంగా చర్చించారు. తదనుగుణంగా సంబంధిత విభాగాల అధిపతులకు, పర్యవేక్షకులకు పలు ఆదేశాలిచ్చారు.
వైదిక సిబ్బంది, ఆలయ విభాగాధికారులు పరస్పరం సమన్వయంతో ఉత్సవాల్లో జరిగే ఆయా కైంకర్యాలు ఎటువంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలని ఈఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆలయ విభాగానికి సూచించారు. ఉత్సవాల్లో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయంలో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు తదితర విషయాలను చర్చించారు. ఉత్సవాల్లో కైంకర్యాలు సమర్పించడంలో ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని చెప్పారు.
మహా శివరాత్రి నాడు ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరునాడు జరిగే రథోత్సవం తదితర కార్యక్రమాలకు పకడ్బందీగా తగిన ఏర్పాట్లు చేయాలని ఈఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి తదితర చోట్ల ఏర్పాట్లపై చర్చించారు. అటవీ శాఖ సహకారంతో నడక దారిలో వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్మణకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు ఆదేశాలు ఇచ్చారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులు సేద తీరడానికి ఆరు బయలు ప్రదేశాల్లో పైపు పెండాల్స్, షామియానాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఎం శ్రీనివాసరావు ఆదేశించారు. వీటి వద్ద తగినంత విద్యుద్ధీపాలను ఏర్పాటు చేయడంతోపాటు తగినన్నీ శౌచాలయాలు ఉండాలని చెప్పారు. ఈ సంవత్సరం సంచార శౌచాలయాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.
క్యూ కాంప్లెక్సు, క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఈఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ముఖ్యంగా దర్శనానికి వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం తదితరాలు అందజేస్తూ ఉండాలని అన్న ప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి లోపాలు తలెత్తరాదని చెప్పారు. క్యూ లైన్లన్నీ ధృడంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రజా సౌకర్యాలకు అవసరమైన అన్ని మరమ్మతులు చేయించి, వాటిని కూడా వినియోగంలోకి తేవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. క్షేత్ర పరిధిలో అవసరమైన చోట అదనపు కుళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు. గతంలో మాదిరిగానే క్షేత్రాన్ని జోన్లు, సెక్టార్లుగా విభజించి ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగించేలా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు, సామాన్లు భద్రపరిచే గది, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, భద్రతా విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈఓ ఎం శ్రీనివాసరావు సూచించారు. గత సంవత్సరం కంటే ఈసారి అదనపు ప్రదేశాల్లో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. పార్కింగ్ ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసే విధంగా సూచిక బోర్డులు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. స్థానిక పోలీసుశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు రికవరీ వాహనం, టోయింగ్ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పాతాళ గంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పాతాళ గంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళ గంగలో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి అవసరమైన గదుల ఏర్పాటు, పాతాళ గంగ మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మతుల విషయమై శ్రద్ధ వహించాలని చెప్పారు.
భక్తుల రద్దీకనుగుణంగా అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లు ఉండాలని ఈఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. క్షేత్ర పరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛంద సేవా సంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఉత్సవాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడే విధంగా విద్యుద్ధీపాలంకరణ ఉండాలని ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఆరు బయలు ప్రదేశాల్లో తగినంత విద్యుద్ధీపాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
సంప్రదాయ బద్ధంగా, ఆకర్షణీయంగా ఉత్సవాల్లో పుష్పాలంకరణను తీర్చిదిద్దాలని ఉద్యానవన అధికారిని ఈఓ ఎం శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పీఆర్ఓ విభాగానికి సూచనలు చేశారు. వేద సంస్కృతి, సనాతన ధర్మంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశానికి ముందుగా గత సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సమావేశంలో శ్రీశైలం తహశీల్దార్ కేవీ శ్రీనివాసులు, అటవీశాఖ రేంజ్ అధికారి సుభాష్ రెడ్డి, మండల ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఆర్ శ్రీవాణి, ఎఎస్ఐ బీసీ గురువయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న అపోలో వైద్యులు డాక్టర్ టీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.