హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం నడుస్తున్నదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్పుల పేరిట సాంలకు తెరలేపారని, మద్యం టెండర్లలో కుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం విక్రయించారని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు అదే డిస్టిలరీ నుంచి మద్యం తీసుకుంటూ నాణ్యమైన లికరంటూ ఊదరగొడుతున్నదని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో స్టాక్ యార్డులు దోచేశారని మండిపడ్డారు. ఏపీలో దోచుకో, పంచుకో, తినుకో పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు. ఐదు నెలలుగా సూపర్ సిక్స్ జాడే లేదని విమర్శించారు.