వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆభరణాల అపహరణ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు తీసిన ఆభరణాలు నకిలీవిగా గమనించిన భక్తులు నిలదీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన వెండి ఆభరణాలను మాజీ ఈవో నర్సయ్య తన అవసరాల కోసం అమ్ముకున్నాడు. అతనికి పూజారి కిశోర్ శర్మ సహకరించాడు. అయితే వైకుంఠ ఏకాదశి సమీపిస్తుండటంతో విషయం అందరికీ తెలిసిపోతుందని భావించిన నర్సయ్య.. నకిలీ ఆభరణాలను చేయించాడు. అసలు వాటిలా కనిపించేలా వెండి తాపం వేయించాడు. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా.. నకిలీ వాటిలా కనిపించాయి. దానిపై భక్తులు నిలదీయడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆభరణాల మాయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిశోర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆలయానికి సంబంధించి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మొత్తం 5.83 కిలోల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయని అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.