విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఒడిశా-ఏపీ కోస్తాపై ఈ అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతున్నది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2, ముంచంగిపుట్టు మండలం బోరంగులో 5.3, అరకులోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలో 3 నుంచి 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉన్నది. వరద ప్రభావిత జిల్లాల అధికారులను ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అప్రమత్తం చేసింది. వరద పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరదల నేపథ్యంలో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ముందస్తు అత్యవసర సహాయక చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సహాయక చర్యల్లో అధికారులతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రకాశం బరాజ్ ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో బరాజ్ గేట్లను ఎత్తివేశారు. వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదిలో పడవలు, మోటారు పడవలు, స్టీమర్లు ప్రయాణించరాదని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం, స్నానం చేయడం వంటివి చేయకూడదని సూచించారు.
వర్షాలతో పలు రైళ్లు పాక్షిక రద్దు
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ-విశాఖపట్నం-కాకినాడ (17267/17268), విజయవాడ-బిట్రగుంట-విజయవాడ (07978/07977) రైళ్లను బుధవారం వరకు పూర్తిగా రద్దు చేశారు.