అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మూడురోజుల పాటు మద్యం విక్రయాల (Liquor sales ) ను నిషేదించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఈవీఎం(EVM) ల ధ్వంసం, అభ్యర్థులు, పోలీసులపై దాడులు, ఏజెంట్లు, ఓటర్లపై దాడులు జరిగాయి.
వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం కౌంటింగ్ (Counting) రోజున గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రర్త గా జూన్ 4, 5, 6 తేదీల్లో మూడురోజుల పాటు మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ(DGP) హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను పరిశీలించి, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని, పోలీసు సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలు అమర్చాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. ఇప్పటికే అనుమానం ఉన్న పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు.