Leopard | శ్రీశైలం : పాతాళగంగ మెట్ల సమీపంలో చిరుతపులి మృత్యువాతపడింది. చిరుత కళేబరాన్ని చూసిన పలువురు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, గత కొద్దిరోజులుగా పాతాళగంగ మెట్ల సమీపంలో కుక్కల కోసం చిరుతపులి తిరుగుతుందని స్థానికులు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ఎవరైనా విషప్రయోగం చేశారా? లేదంటే సహజంగానే మృతి చెందిందా? స్మగ్లర్ల పనా? అనే కోణంలో అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
గత ప్రాజెక్ట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చిరుతలు సంచారిస్తున్నాయి. దాంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏపీ జెన్కో కాలనీ, డ్యామ్ సమీపం, పాతాళగంగ తదితర ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపించింది. గత నెలలో పాతాళగంగ వద్ద ఒక చిరుత ఇళ్లలోకి వచ్చిందని.. పంప్ హౌస్ వైపు పరుగెత్తినట్లు పలువు పేర్కొన్నారు. ఆగస్టులో దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గూడెంలో మూడేళ్ల చిన్నారిని చిరుత లాక్కువెళ్లింది. చిన్నారి కేకలతో తల్లిదండ్రులు నిద్రలో నుంచి మేల్కొని చిరుత వెంట పరుగులు తీయడంతో చిన్నారి చెట్ల పొదల్లో పడేసి పారిపోయింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది. చిన్నారికి తల, మెడ భాగంలో గాయాలవగా.. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.