తిరుమల: తిరుమల (Tirumala) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి (Leopard) బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో చిరుతపులి బోనులో చిక్కిందని అధికారులు తెలిపారు. దానికి ఏడాదిన్నర వయసు ఉంటుందని చెప్పారు. అయితే ఒక్కరోజులోనే చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
గురువారం రాత్రి తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుతపులి బాలుడిపై దాడిచేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటుండగా క్కసారిగా వచ్చిన చిరుత.. బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన దుకాణదారుడు, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. దీంతో కట్రోల్ రూం వద్ద బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని పద్మావతి చిన్నపిల్లల దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.