అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల( Tirumala) , తిరుపతిలో గురువారం భారీ వర్షం(Heavy Rains) కురిసింది. వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. తిరుమల 2వ ఘాట్రోడ్డులోని హరిణికి సమీపంలో బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది బండరాళ్లను తొలగిస్తున్నారు.
వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ (TTD) అధికారులు కోరారు. వర్షాల కారణంగా పాప వినాశనం, శ్రీవారి పదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గో గర్భం, పాప వినాశం పూర్తిగా నిండిపోయి బయటకు నీరు ఔట్ ఫ్లో అవుతున్నది.
భారీగా కురిసిన వర్షం వల్ల తిరుపతి వీధులు జలమయం అయ్యాయి. గొల్లవానిగుంట, లక్ష్మీపురం కూడలి తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తున్నది. వెస్ట్ చర్చి చౌరస్తాలోని రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతం వర్షపు నీటితో నిండిపోవడంతో అధికారులు వాహనాలను దారి మళ్లించారు.