Lagadapati Rajagopal | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి సర్వే ఫలితాలను చెప్పడం మానేశానన్నారు. ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్న సమయంలో ప్రజల నాడి తెలుసుకునేవాడినని.. ప్రస్తుతం తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేమీ లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎప్పుడూ లేనివిధంగా ఓటింగ్ బాగానే జరుగుతుందని చెప్పారు.
మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉంటుందని ఓటు వేసేందుకు వచ్చానన్నారు. కానీ, ఎక్కడ చూసినా జనాలు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారని.. ఉత్తేజంగా జనం ఓటు వేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని.. అలాంటి ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలతో హైదరాబాద్ ఖాళీ అయ్యిందని.. ప్రజలందరూ ఓట్లు వేయడానికి బస్సుల్లో, విమానాలు, రైళ్లలో వస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలువబోతున్నారో తాను చెప్పలేనని.. జూన్ 4న అందరికీ తెలుస్తుందన్నారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరున్నది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆయన సర్వేలు నిర్వహించే.. వెల్లడిస్తుండేవారు. ఆయన సర్వే ఫలితాలపై రాజకీయ వర్గాలతో పాటు జనంలోనూ ఆసక్తి ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. ఆ తర్వాత ఆయన సర్వేలు నిర్వహించడం, ఫలితాలను వెల్లడించడం మానేరు. రాజకీయాలకు సైతం గుడ్‌బై చెప్పారు.