అమరావతి : ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువయ్యిందని టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ( Bhumana Karunakar Reddy ) ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశీనాయన ( Kasinayana ) క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు ( Chandra babu) గాని, సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawankalyan ) కాశీనాయనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనాందుల గొంతుక ఎందుకు మూగబోయిందని అన్నారు.
కాశీనాయన క్షేత్రాన్ని కూల్చింది పవన్ సంబంధిత శాఖల అధికారులే అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు క్షమాపణ చెప్పారని నిలదీశారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా అని ప్రశ్నించారు. టైగర్‌జోన్ పరిధిలో ఉండడం వల్లే కాశీనాయనను కూల్చివేశామని దేవాదాయశాఖ మంత్రి సమాదానం ఇచ్చారని, టైగర్ జోన్లో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా అంటూ మండిపడ్డారు.
కూటమి పాలనకు హిందూ ధర్మానికి గడ్డుకాలం దాపురించిందని ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీనెయ్యి జరిగిందని పచ్చి అబద్దాన్ని వైసీపీ ప్రభుత్వంపై నిందలు మోపారని విమర్శించారు. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి సన్నిధిలో అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.