Srisailam Temple | శ్రీశైలం : శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమ్మవారికి ఈ నెల 15న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వేడుకలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశిని అమ్మవారికి సాత్మికబలిగా సమర్పించనున్నారు. కుంభోత్సవం సందర్భంగా ప్రాతఃకాల పూజల అనంతరం భ్రమరాంబ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణాలు నిర్వహించనున్నారు.
ఆయా పూజలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తారు. పూజల అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాలు, గుమ్మడికాయలు మొదటి విడత సాత్వికబలిగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా హరిహరరాయగోపురద్వారం వద్ద మహిషాసురుమర్దిని అమ్మవారికి (జోటమ్మవారికి) ప్రత్యేకపూజలు చేసి సాత్మికబలిగానే కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే సాయంకాలం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారి ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షిణ మండపంలో అన్నాన్ని కుంభరాశిగా పోసి, సింహ మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు. ఆ తర్వాత సంప్రదాయం మేరకు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవం ప్రధానఘట్టం మొదలవుతుంది. కుంభహారతి సమయంలోనే పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు, కుంకుమల సమర్పణకే ‘శాంతి ప్రక్రియ’ అని పేరుందని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా రెండో విడత సాత్వికబలిగా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కుంభహారతి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు చెప్పారు. వేడుక సందర్భంగా అమ్మవారికి పలురకాల వంటకాలతో మహానివేదన చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవం సందర్భంగా కల్యాణ వేడుకలను నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీస్వామిఅమ్మవారి కల్యాణోత్సవం, ఏకాంత సేవలను నిలిపివేస్తున్నామని, అలాగే.. అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నీ బుధవారం నిలిపివేసినట్లు వివరించారు. ఈ మేరకు భక్తులు సహకరించాలని కోరారు.