అమరావతి: ఏపీలోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్పేరు పెట్టడం గర్వంగా భావించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ఇవాళ కోనసీమ జిల్లా పెద్దలకు విన్నపం అంటూ ఓ లేఖను విడుదల చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును పెట్టడంపై కొంతమంది అలజడలు సృష్టించడం అన్యాయమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను యావత్తు ప్రపంచమే ప్రశంసిస్తుంటే జిల్లాకు అంబేద్కర్ పేరుపై అభ్యంతరం పెట్టడం న్యాయమా అని పేర్కొన్నారు. గోదావరి పై ధవళేశ్వరం ఆనకట్టను కట్టిన విదేశి వ్యక్తి కాటన్ దొర విగ్రహాలను, ఆయన ఫొటోలను ఊరూరా పెట్టి గౌరవిస్తుంటే భారత ప్రజలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వల్ల అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని కొనియాడారు.
జిల్లా నాయకులు పినిపే విశ్వరూప్, శాసనసభ్యులు పొన్నాడ సతీశ్,నాయకులు కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ తదితరులు ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యకు ముగింపు పలికేందుకు ఆలోచన చేయాలని ముద్రగడ కోరారు.