విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే పక్కదారి పట్టాడు. కన్నబిడ్డల్లా చూడాల్సిన స్టూడెంట్పైనే కన్నేశాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజ్ ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఒంటరిగా ఉన్న బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపాల్ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
మూడు నెలలుగా బాలికకు పీరియడ్స్ రావడం లేదని తల్లిదండ్రులు తాజాగా ఆస్పత్రిలో చూపించారు. దీంతో పరీక్ష చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. కంగారుపడిపోయిన తల్లిదండ్రులు ఏమైందని బాలికను నిలదీయడంతో ప్రిన్సిపాల్ జయరాజ్ చేసిన దారుణాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో రాయవరం పోలీస్‌స్టేషన్‌లో బాలిక, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.