గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్పై గట్టి సెటైర్ ఇచ్చారు. చంద్రబాబు ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన వెంట్రుక ముక్క కూడా పీకలేడని ఎద్దేవా చేశారు.
గుడివాడలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గుడివాడలో ఎంతోమంది మహానుభావులు పుట్టారని.. కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి మాట్లాడారు. నా దగ్గర ఓనమాలు నేర్చుకుని నన్నే విమర్శిస్తారా అని మండిపడ్డారు. కొడాలి నాని ఓ గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. పిచ్చి ఆటలు మానుకోవాలని.. నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. కొడాలి నానికి తానేంటో నిరూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. త్వరలోనే వాళ్ల కథ చెబుతానని హెచ్చరించారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని కూడా అంతే ధీటుగా స్పందించారు. తాను గంజాయి మొక్కను కాదని.. గుడివాడ ముద్దు బిడ్డను అని స్పష్టం చేశారు. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క అని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్లో కాదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు తన వెంట్రుక ముక్క కూడా పీకలేడని ఎద్దేవా చేశారు. తిరుపతి బస్టాండ్లో జేబులు కొట్టే వెదవలకు తాను భయపడనని విమర్శించారు. చంద్రబాబు ఎంత నీచుడో అందరికీ చెబుతానని అన్నారు. చావనైనా చస్తానుకానీ చంద్రబాబు ఉడత ఊపులకు బెదరనని స్పష్టం చేశారు. గుడివాడకు చంద్రబాబు చేసిందేమీ లేదని కొడాలి నాని అన్నారు. 14 ఏళ్లలో పేదల కోసం ఒక ఎకరం కూడా కొనలేదని విమర్శించారు. చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరమైనా సేకరించాడా అని ప్రశ్నించారు. గుడివాడకు రూ.100 కోట్లు ఖర్చుపెట్టినట్లు చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.