హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీకి, ప్రైవేట్ మద్యం దుకాణాలకు, రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం వైపు మెజార్టీ మంత్రులు మెగ్గుచూపినట్టు సమాచారం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది.