Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి తగిన ఆధారాలు తమకైతే కనిపించడంలేదన్న అత్యున్నత ధర్మాసనం.. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ఎలా ప్రకటన చేస్తారని చంద్రబాబును నిలదీసింది.
ఈ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాష్ట్రప్రభుత్వం నియమించిందని గుర్తుచేసిన ధర్మాసనం.. ఒకవైపు సిట్ విచారణ జరుగుతున్న సమయంలో సీఎం మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమున్నదని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు లేవనెత్తింది. ఈ మేరకు లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏమిటీ వివాదం?
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి గురైనట్టు ఎన్డీడీబీ ల్యాబ్ తన నివేదికలో ఆరోపించింది. ఈ విషయాన్ని సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు మీడియాకు తెలియజేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి విషయంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.