Srisailam | కార్తీకమాసోత్సవాల నిర్వహణలో భాగంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని (కార్తీక వనభోజనాలు) నిర్వహించారు. ఆలయ ఈశాన్యభాగంలోని రుద్రవనంలో (రుద్రాపార్కులో) ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ వనసమారాధనలో (వనభోజనాలలో) శ్రీశైల దేవస్థానం అన్నీ విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అదేవిధంగా పలు స్థానిక ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రుద్రవనంలోని ఉసిరిచెట్టుకు సంప్రదాయబద్ధంగా పూజాధికాలు జరిపించారు. ఆలయ ఈవో ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్ ఈ పూజాధికాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ.. వైదికసంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా, ఆలయ సంప్రదాయాలపై అందరికీ అవగాహన కల్పించాలనే భావనతో ఈ వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంప్రదాయబద్ధంగా వనభోజనాలు చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయని చెప్పారు. శ్రీశైల మహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడం వల్ల మరింత ఫలితం లభిస్తుందని పేర్కొన్నారు.
శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్ప తీర్థంగా కూడా మన పురాణాలు పేర్కొన్నాయని.. ఈ క్షేత్రం ఎన్నో తీర్థాలకు నిలయమని ఈవో తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రానికి అనాది క్షేత్రం అనే ప్రసిద్ధి ఉందని పేర్కొన్నారు. యుగయుగాలుగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పారు. భూ మండలానికి నాభి స్థానంగా ఈ క్షేత్రం పేర్కొనబడిందని, అందుకే మనం ఆచరించే వైదిక కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పడం జరుగుతుందన్నారు.