Srisailam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మారాయి. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టిదోషనివారణ కోసం పార్వతీదేవి తొలిసారిగా జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించినట్లు పురాణ ఇతిహాసాల్లో ఉన్నందున శ్రీశైల క్షేత్రంలో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో లవన్న చెప్పారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకువచ్చి దీపప్రజ్వలన కార్యక్రమాన్ని జరిపించినట్లు ఈవో తెలిపారు.
