Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు దీప దానాలు చీరసారెలను సమర్పించుకున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయదే వాలయాల్లో అలంకార దర్శనాలు మాత్రమే కల్పించినప్పటికీ సుమారు మూడు గంటలకుపైగా దర్శన సమయం పట్టింది. క్షేత్రపరిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో యాత్రికులు కూడా సహకరించాలని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కోరారు. సాయంత్రం పౌర్ణమి సందర్భంగా వచ్చిన యాత్రికులు.. ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించి స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు దీరారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఊయలసేవ మరియు పల్లకిసేవ కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారికి ప్రీతికరమైన వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో వేంచేబుచేసి మహా సంకల్పము, ఖడ్గమాల, అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేశారు.
Srisailam4
కార్తీక పౌర్ణమి సందర్భంగా పాతాళగంగ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలను డిప్యూటీ ఈవో రవణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కృష్ణమ్మకు పసుపు కుంకుమ గాజులతో చీరసారెలను సమర్పించి గంగ హారతులను ఇచ్చారు. అర్చక వేదపండితుల మంత్రోచ్చారణతో ఏక హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నందిహారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతులతో ఏకాదశ గంగా హరతులను నివేదించారు.
Srisailam1
పౌర్ణమి ప్రదోషకాలంలో ఆలయ ప్రధాన వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయంగా దాతలు అందించిన నూలువత్తులను ఆవునెయ్యితో తడిపి ఎత్తైన స్తంభాలపై వేలాడించి దీప ప్రజ్వలన చేశారు. త్రిపురాసురుణ్ని సంహరించిన తరువాత పరమేశ్వరునికి దృష్టి దోష పరిహారం కోసం, విజేయుడైన శుభవేళలో పార్వతీ దేవి తొలుతగా జ్వాలాతోరణం జరిపించినట్లు పురాణ ఇతిహాసాల ప్రవచనాలను భక్తులు ఆద్యంతం వింటూ దీప కాంతులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో తోపాటు, ఆలయ ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Srisailam12
కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దశవిధ హారతులు ఇచ్చారు. అనంతరం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల ప్రతి ఒక్కరూ కార్తీక దీపాలను వెలిగించుకునే అవకాశాన్ని కల్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Srisailam2
Srisailam3
Srisailam6
Srisailam7
Srisailam9
Srisailam10
Srisailam11
Srisailam14