Srisailam Temple | శ్రీశైలం : కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు గోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు, జ్ఞాపిక అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, శ్రీశైలం సీఐ జీ ప్రసాదరావు ఉన్నారు.