హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. తన అనుచరులతో కలిసి బీజేపీకి మూకుమ్మడిగా రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, ప్రధాని మోదీపై తనకున్న అభిమానం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన, ఏ పార్టీలో చేరుతారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు.