అమరావతి : తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తిరుమల, తిరుపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఏపీ హైకోర్టు(AP High Court) లో పిల్ దాఖలు చేశారు.
ఇటలీ ప్రభుత్వం 741 మంది క్యాథలిక్‌లో వాటికన్‌ను దేశంగా ప్రకటించగా 34 లక్షల మంది ప్రజలు, మూడు లక్షల కోట్ల ఆస్తులున్న తిరుపతిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించరని అన్నారు. లేకపోతే ప్రత్యేక దేశంగానైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీ, ఎస్పీలకు తగు ఆదేశాలు జారీ చేసి లడ్డూపై రాజకీయ ప్రచారం జరుగకుండా చర్యలు తీసుకోవాలని పిల్ వేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల లడ్డూపై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అదేవిధంగా తిరుమల, తిరుపతిలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసి ఉండాలని , దీనిని రాజకీయం చేయవద్దని సూచిస్తూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు నోటీసులు పంపించనున్నట్లు పాల్ వెల్లడించారు.