ఖైరతాబాద్, మార్చి 28: జర్నలిస్టు కేవీఆర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ‘ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం’ అనే అంశంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ అరెస్టు వెనుక ఏపీకి చెందిన పెద్ద వ్యవస్థే పనిచేసిందని ఆరోపించారు.
కేవీఆర్‌పై దాడి, అక్రమ అరెస్టును ఇక్కడి అస్తిత్వంపై దాడిగానే భావిస్తున్నామని అన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పరిశ్రమలన్నింటినీ మూసివేయించాడని, నిజాం షుగర్స్‌కు చెందిన 32 వేల ఎకరాల చెరుకు భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశాడని విమర్శించారు. నాటి బాబు పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో నదులు, నిధులు, నియామకాలన్నీ ఏపీకే పోతున్నాయని, సీఎం ఆఫీసు నిండా బాబు మనుషులే ఉన్నారని మండిపడ్డారు. ఎల్లో కాంగ్రెస్, ఎల్లో మీడియా కలిసి ఇక్కడ దురాగతాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టు కేవీ రెడ్డి మా ట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టినందుకే తనను అక్కడి పోలీసులు అరెస్టు చేసి వేధింపులకు గురిచేశారని తెలిపారు.
తెలంగాణలో ఆంధ్రా రాజకీయాలు కొనసాగుతున్నాయని, తన గొంతు నొక్కేస్తే అ లాంటి విషయాలు వెలుగులోకి రావ ని తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో సినీ దర్శకుడు, సామాజికకార్యకర్త సయ్యద్ రఫీ, సీనియర్ జర్నలిస్టు మామిడి సోమయ్య, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.