Jawan Murali Nayak | అమరావతి : శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్ ప్రాణాలు విడిచినట్లు అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. మురళీ నాయక్ మృతదేహం రేపు ఉదయం స్వగ్రామానికి చేరుకోనుంది.
2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు మురళీ నాయక్‌ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు. శుక్రవారం ఉదయం చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చెక్కును మురళీ కుటుంబ సభ్యులకు మంత్రి సవిత అందజేశారు.