హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించారు. భారతిముఖి మృతి పట్ల సంజుష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ.. ప్రమాదానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని,దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
ప్రమాదం అనంతరం తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని సంజుష్ తెలిపారు. గాయపడిన భారతి ముఖికి తక్షణ వైద్యం అందించేందుకు తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించినట్లు చెప్పారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో తన పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహించినట్లు సంజుష్ తెలిపారు. ఈ మూడు పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానా అనే అంశాన్ని నిర్ధారించే పరీక్షల్లోనూ ఎలాంటి ప్రతికూల ఫలితం రాలేదని స్పష్టం చేశారు.
ప్రమాదం అనంతరం తాను తీసుకున్న చర్యలు, బాధితురాలిని ఆస్పత్రికి తరలించడం, అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లడం, దర్యాప్తుకు సహకరించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సంజుష్ విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షల ఫలితాలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నిర్ణయానికి రావాలని కోరారు.
కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని సంజుష్ తెలిపారు. అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి చట్టపరంగా తన బాధ్యతను స్వీకరిస్తానని, దేశ చట్టవ్యవస్థ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.