AP News | వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్‌మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సోషల్‌మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారని పూడి శ్రీహరి, అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త గుట్టూరు గిరీశ్‌కుమార్ రెడ్డిలపై చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వినోద్‌కుమార్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన పూడి శ్రీహరిని విజయవాడలో కుప్పం పోలీసులు అరెస్టు చేయగా.. కుప్పం మెజిస్ట్రేట్ కోర్టు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ తిరస్కరించింది. కుప్పం మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కుప్పం మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.
దీనిపై పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. ఈ కేసులో వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.