అమరావతి : ఏపీలో వైఎస్ జగన్(YS Jagan) రాక్షస పాలన కొనసాగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ(YCP Rule) పాలన కూటమి దెబ్బతో ఇంటికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. క్విట్ జగన్(Quit Jagan), సేవ్ రాయలసీమ(Save Rayalaseema) నినాదం ప్రజల్లో రావాలని,అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కడప స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. టీడీపీ హయాంలో రాయలసీమ కు తీసుకొచ్చిన కియా మోటార్స్ (Kia motors) వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని వివరించారు. రాష్ట్రానికి జగన్ ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాక, ఉన్న వాటిని తరిమేశారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాయలసీమ కోనసీమ కంటే అద్భుతంగా తయారవుతుందని వెల్లడించారు.
జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 12 వేల కోట్లు ఖర్చుపెట్టగా వైసీపీ కేవలం 2కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని విమర్శించారు. కృష్ణ జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల అని చంద్రబాబు పేర్కొన్నారు.