అమరావతి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ISRO ) సంస్థ చైర్మన్ (ISRO Chairman) వి నారాయణన్ మంగళవారం తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ (TTD) అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న నారాయణన్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు .
అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29న ఉదయం 6. 23 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ -15 (GSLV- F15 ) ప్రయోగం జరగనుందని వివరించారు. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు ప్రారంభించింది. 27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. అంటే బుధవారం ఉదయం 6.23 గంటలకు షార్‌లోని రెండో ల్యాంచ్ఫ్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది.
ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించగా.. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది కావడం విశేషం. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది.