Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున్న అభిమానం చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. ఇదే విషయంలో కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలోనూ చర్చ జరుగుతుంది.
అసలు చిరంజీవి బీజేపీలో చేరబోతున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరగడానికి ఒక కారణం ఉంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్‌కు ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. కానీ వారందరిలో మెగాస్టార్ స్పెషల్ ఎట్రాక్షన్ కావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన ఆ ఈవెంట్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో చిరంజీవితో మోదీ చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు. కిషన్ రెడ్డి నివాసంలో ఉన్నంతసేపు కూడా చిరంజీవిని తన పక్కనే ఉంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ వీడియోలో వైరల్‌గా మారాయి. చిరంజీకి ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాముఖ్యత కారణంగానే ఆయన బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం జోరుగా జరుగుతుంది. చిరంజీవికి రాజ్యసభ పదవి ఇచ్చి మోదీ కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవికి ప్రధాని మోదీ ఇంతలా ప్రాధాన్యత ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన సమయంలో కూడా చిరంజీవితో ప్రధాని మోదీ అదే ఆప్యాయత చూపించారు. కూటమి నాయకుడు అయిన చంద్రబాబు కంటే కూడా చిరంజీవితోనే ఎక్కువ చనువుగా మెదిలాడు. పవన్ కల్యాణ్, చిరంజీవి ఇద్దరినీ ఆప్యాయంగా హత్తుకోవడమే కాకుండా.. వారితో చిరునవ్వులు చిందిస్తూ.. చాలాసేపు మాట్లాడారు. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని అభివాదం చేశారు. అప్పుడే చిరంజీవి బీజేపీలోకి చేరబోతారని ప్రచారం జరిగింది.
ప్రజా రాజ్యం అని సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న చిరంజీవి.. తన పార్టీని అప్పట్లోనే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేటవ్వడమే కాకుండా కేంద్రమంత్రి పదవిని కూడా పొందారు. కానీ ఆ సమయంలో జరిగిన పరిణామాలను చూసిన చిరంజీవి రాజకీయాలపై విరక్తిని పెంచుకున్నాడు. అప్పటి నుంచి పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చిరంజీవి ప్రకటించారు. అందుకే తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసినప్పటికీ బయట నుంచే మద్దతు ఇచ్చారు తప్ప.. పార్టీలో కీలకంగా వ్యహరించలేదు. పైగా తమ్ముడి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని.. పదవులు పొందాలని అనుకోలేదు. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే.. బీజేపీనే చిరంజీవిని తమవైపు ఆకర్షించుకుంటుందని తెలుస్తోంది. ఆయన్ను పార్టీలోకి తీసుకునేలా కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలనే చిరు నిర్ణయాన్ని గౌరవించి.. ఆయన్ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!