YS Jagan | సనాతన ధర్మం అంటే ఏంటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. శ్రీవారి విశిష్ఠతను దెబ్బతీయడంలో పవన్ కల్యాణ్ కూడా భాగమయ్యాడని విమర్శించారు. దేవుడి విషయంలో తప్పును గుడ్డిగా సమర్థించడమే సనాతనమా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ తమపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు.
తిరుమల అంటే భయం భక్తి లేదని నిరూపించుకుంటూ చంద్రబాబు పదే పదే అబద్దాలు చెప్పారని వైఎస్ జగన్ అన్నారు. మత విశ్వాసాలను చంద్రబాబు ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని తెలిపారు. దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పిందని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని చంద్రబాబును సుప్రీంకోర్టు ప్రశ్నించిందని తెలిపారు.సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా ఈవో ప్రకటన ఉందని అడిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆధారాలు లేవని చెప్పిందన్నారు. ఆ ప్రకటన చేయడానికి సీఎం వద్ద ఉన్న ఆధారాలు ఏంటని నిలదీసిందని తెలిపారు. నెయ్యి కల్తీ అంశంపై సెకండ్ ఒపీనియర్ కోసం వేరే ల్యాబ్‌కు ఎందుకు పంపించలేదని ప్రశ్నించిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అని నిలదీసిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినా చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. చంద్రబాబు భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తప్పు చేశానని తిరుమలలో వేడుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు ఎవరిని తిట్టింది? బుక్కయింది ఎవరు అని ప్రశ్నించారు. దేవుడిని సైతం రాజకీయాల్లో వాడుకునే బుద్ధి చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు లాంటి నేతలు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.
అసలు పవన్ కల్యాన్‌కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న తప్పును మోస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు జరిగిందని కళ్లకు కనిపిస్తున్నా కూడా దాన్ని అడ్డుకోలేని వ్యక్తి ధర్మం గురించి మాట్లాడటమా అని మండిపడ్డారు. తప్పును అడ్డుకోకుండా సనాతన ధర్మం అనడం ధర్మమేనా అని ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే వ్యవహారం మామూలుగా ఉండదని హెచ్చరించారు. వారికి జరగబోయే నష్టం కూడా మామూలుగా ఉండదని అన్నారు. దేవుడి కోపం చంద్రబాబుకే పరిమితం కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
తప్పు జరగనప్పుడు సిట్ అవసరం లేదు.. బిట్ అవసరం లేదని వైఎస్ జగన్ అన్నారు. అసలు ఏం జరగని దానికి విచారణ ఎందుకు అని ప్రశ్నించారు. జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ జరగనప్పుడు ఏ అధికారి వచ్చి ఏం చేస్తారని వ్యాఖ్యానించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారని స్పష్టం చేశారు.