అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీ ( DSC ) ఎంపికలో అనేక అవకతవకలు,అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan )ఆరోపించారు. అర్హులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండ లంచాలు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. అన్ని అర్హతలు ఉండి జాబ్ రాని అభ్యర్థులు ప్రభుత్వంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ స్కాం( Scam )పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న మతలాబు ఏమిటని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర అని, అతడిపై విచారణకు చంద్రబాబు ముందుకు రాడని అన్నారు. స్కాంలో లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసాలేనని ఆరోపించారు.
కేవలం 16 వేల టీచర్ల భర్తీలో స్కామ్‌లు, లీకులు అనేకం ఉన్నాయని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. ఎక్కడా ఒక్క తప్పు జరుగకుండా లక్షా 3వేల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో పెద్ద స్కాం జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిభ ఉన్న వ్యక్తులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.డీఎస్సీ పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా , స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు తన వాళ్ల కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నారని విమర్శించారు.