అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తయారయ్యే తిరుమల ( Tirumala ) లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం దర్యాప్తును ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం సిట్ సభ్యులు తిరుపతికి చేరుకున్నారు.
గత టీటీడీ(TTD) పాలకులు లడ్డూలో (Laddu) కల్తీ నెయ్యి (Adulterated Ghee) కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఏపీ ప్రభుత్వం ఆరోపించడంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు ఆందోళనకు గురయ్యారు.
ఈ కేసు సుప్రీంకోర్టు (Supreme Court ) వరకు వెళ్లడంతో కోర్టు స్పందించి సీబీఐ డైరెక్టర్ (CBI Director) నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివనారాయణ, కృష్ణమోహన్, వెంకట్రామయ్య ఉన్నారు. సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, తిరుమల ఏఆర్ డైరీలలో విచారణ చేయనున్నారు.
నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి సమాచారాన్ని సేకరించనున్నారు.