అమరావతి : ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో (Innovative campaign ) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు ( Yamadharmaraju, గణేశుడి(Ganesh) అవతారంలో వాహనదారులకు అవగాహన కల్పించడం స్థానికులను ఆలోచింప జేసింది.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనదారులు చనిపోతున్నారని, అందుకు గల కారణాలను వివరిస్తూ గుంటూరు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే ప్రాణ నష్టాలను వివరించే ప్రయత్నం చేశారు.
హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన ద్విచక్రవాహనదారుడిని ఆపి యమధర్మరాజు వేషంలో ఉన్న వ్యక్తి వద్ద యమపాశాన్ని అతడి చేతికి, మెడకు వేసి నరకానికి తీసుకెళ్తున్నట్లు అవగాహన కల్పించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించిన ద్విచక్రవాహనదారుడికి గణేశుడు ఆశీర్వదించే కార్యక్రమాన్ని నిర్వహించారు.