అమరావతి : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగ స్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం వర్చువల్ గా నిర్వహించిన “పీఎం గతిశక్తి” సదస్సులో ఆయన పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం ఏపీ చేపడుతున్న చర్యలను,అనుసరిస్తున్న మార్గాలను ఈ సందర్భంగా మంత్రి మేకపాటి వివరించారు.
సరకు రవాణా, మౌలిక సదుపాయల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఫైబర్ నెట్, పారిశ్రామిక అభివృద్ది, కొత్త విద్యుత్ ఉత్పాదక మార్గాలు, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను పెంచడం, సరకు రవాణా ఖర్చును తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
రూ.18వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లోని భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను,9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని మంత్రి మేకపాటి తెలిపారు. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ వంటి మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ కలుపుతూ యువతకు పెద్దఎత్తున ఉద్యోగవకాశాలతో పాటు రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ముందుకెళుతోందని మంత్రి వివరించారు.